గౌతమి ప్రచారంతో కమల్ కు ఇబ్బందులు తప్పవా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేసేందుకు 30 మందితో కూడిన జాబితాను బీజేపీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక వీరితో పాటు స్థానిక బీజేపీ నేత, నటి గౌతమిని కూడా స్టార్ క్యాంపెయినర్‌గా అధిష్టానం ప్రకటించింది. కాగా అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కాషాయ పార్టీకి 20 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో రాజపాళయం సీటు కమలనాథుల చేజారడంతో, ఆ స్థానం నుంచి పోటీపడదామనుకున్న గౌతమికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. కాగా కమల్ హాసన్- గౌతమి పదమూడేళ్ల పాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. విభేదాలు తలెత్తిన కారణంగా 2016లో వీరు విడిపోయారు. ఇక గౌతమిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో, ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కాగా ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కమల్‌కు శరత్ కుమార్, రాధిక వంటి ప్రముఖుల మద్దతు ఉంది.













