బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ సెటైర్లు.. ఇంధనం నింపలేదంటూ జోకులు
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన ఆమె.. బీజేపీ చెప్పుకునే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై జోకులు పేల్చారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వమే ఉందని, కాకపోతే ఇంజిన్లో ఇంధనం నింపడం మర్చిపోయి ఉంటారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంశాలపై అధికార బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో సోమవారం నాడు ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, తమ తొలి మంత్రివర్గ సమావేశంలోనే పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు రావడం మామూలే. కానీ ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని మర్చిపోవద్దు. ప్రజలకు పాత పెన్షన్ పథకం ఫలాలు ఎందుకు అందడం లేదు? కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈ స్కీమ్ వల్ల కోట్లాదిమంది ప్రజలు లబ్ధిపొందుతున్నారు. కాబట్టి బాగా ఆలోచించి ఓటేయండి’ అని ప్రజలకు ప్రియాంక సూచించారు. బీజేపీ నేతలు వచ్చి తమను గెలిపిస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుందని అంటారని, ఐదేళ్లుగా ఆ ప్రభుత్వం ఏం చేసిందని సూటిగా ప్రశ్నించారు.













