కేజ్రీవాల్‌తో భేటీ వెనుక నితీశ్ ఆలోచన అదేనా?
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్ సీఎం, జేడియూ అధినేత నితీశ్ కుమార్ తన పంథా మార్చారు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. వీళ్లిద్దరూ కలిసి ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎదురు నిలవాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అంగీకరించారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు కలిసి కట్టుగా ఉండి, కేంద్రం నుంచి మోదీ సర్కారును సాగనంపాలని అనుకుంటున్నామని కేజ్రీవాల్, నితీశ్ తెలిపారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం తమ పార్టీనే అని కేజ్రీవాల్ గట్టిగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఆయన అనేక వేదికలపై కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్.. గోవా, గుజరాత్లో కూడా ఉనికి చాటుకుని జాతీయ పార్టీ హోదా సైతం దక్కించుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ నేతృత్వంలో ఏకం అవ్వాలనే అంశంపై నితీశ్‌తో కేజ్రీవాల్ ఏకీభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో నితీశ్ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేస్తారేమో అని వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం తేజస్వీ యాదవ్‌ను నితీశ్ కుమార్ కలిశారు. వీళ్లిద్దరూ కలిసి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ వీరిద్దరికీ స్వాగతం పలికారు. ఆ సమావేశంలో కూడా వచ్చే ఎన్నికల గురించే నితీశ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఆప్, కాంగ్రెస్‌లలో ఎవరితో కలిసి నితీశ్ నడుస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.













