జడ్జిల రిటైర్మెంట్ వయసు పెంచాలన్న బార్ కౌన్సిల్.. త్వరలోనే ప్రధానమంత్రి ముందుకు తీర్మానం
భారత దేశంలో న్యాయమూర్తలు రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీనికోసం రాజ్యంగ సవరణలు కోరాలని బార్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. ఇటీవల రాష్ట్ర బార్ కౌన్సిల్లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లతో జరిగిన సమావేశంలో ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ గురువారం నాడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 65 సంవత్సరాలకు పెంచాలని బార్ కౌన్సిల్ అభిప్రాయపడింది. అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 67 సంవత్సరాలకు పెంచాలని కూడా ఈ తీర్మానంలో కోరింది. త్వరలోనే ఈ తీర్మానాన్ని ప్రధానమంత్రి, న్యాయ శాఖకు పంపుతామని బార్ కౌన్సిల్ తెలిపింది. గతంలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండేది. అయితే 1963లో దీన్ని 62 సంవత్సరాలకు పెంచారు. ఈ వయసును 65 ఏళ్లకు పెంచడం కోసం 2010 ఆగస్టులో లోక్సభలో 115వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లు పాస్ అవలేదు.













