కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి గెహ్లాట్ అవుట్.. సీఎం పదవిపై కూడా సోనియాదే నిర్ణయం?
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో అందరి కన్నా ముందే తన అభ్యర్థిత్వాన్ని ధృవీకరించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెక్ పెట్టారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో రగడ విషయంలో ఆమెతో మాట్లాడేందుకు బుధవారం నాడు ఢిల్లీ వచ్చిన గెహ్లాట్ కు సోనియా అప్పాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో అక్కడే పడిగాపులు కాసిన గెహ్లాట్‌కు ఎట్టకేలకు గురువారం నాడు సోనియాతో మాట్లాడే అవకాశం లభించింది. ఈ సమయంలో గెహ్లాట్ ను సోనియా గట్టిగా మందలించారట. కేసీ వేణుగోపాల్ ఎదురుగానే గెహ్లాట్ కు క్లాసు పీకారు. రాజస్థాన్‌లో గెహ్లాట్ వర్గీయులు ఓవర్ యాక్షన్ చేయడం, ఈ విషయంలో తాను ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంపై సోనియా మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజస్థాన్ లో అసమ్మతి రావడం పార్టీకి చాలా చెడ్డపేరు తెచ్చిందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో సోనియా అన్ని విషయాలపై గెహ్లాట్ ను నిలదీశారు. రాజస్థాన్ అసమ్మతిని కంట్రోల్ చేయలేని నాయకుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా నడపగలరని ఆమె సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన నమ్మకాన్ని గెహ్లాట్ వమ్ము చేశారని కూడా సోనియా అన్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. అలాగే తాను రాజస్థాన్ సీఎంగా ఉండాలా? వద్దా? అనే నిర్ణయం కూడా సోనియాదేనని తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడైన కార్యకర్తనని.. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ ఆదేశాలను తాను పాటిస్తూనే ఉంటానని అన్నారు. రాజస్థాన్‌లో తన మద్దతు దారుల చర్యల విషయంలో సోనియాకు సారీ చెప్పానని గెహ్లాట్ వెల్లడించారు.













