హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకెక్కిన కేజ్రీవాల్
మద్యం పాలసీ కుంభకోణంలో తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సుప్రీం కోర్టుకెక్కారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసినట్లు బుధవారం నాడు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ వెల్లడించారు. తమ పిటిషన్‌ను తక్షణమే స్వీకరించి విచారణ చేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కేజ్రీవాల్ తరపు మరో న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి కోరారు. అలాగే ఏ డాక్యుమెంట్ల ఆధారంగా కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిందో, అవి నమ్మదగినవిగా లేవని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పిటిషన్‌ను ఈ-మెయిల్ ద్వారా పంపాలని, అప్పుడే ఈ అంశాన్ని పరిశీలిస్తామని సూచించింది.
ఇదిలా ఉంటే తనకు రిమాండ్ విధిస్తూ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం నాడు విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నైతికత గురించి కాకుండా రాజ్యాంగ నైతికత గురించి న్యాయస్థానం ఆందోళనలో ఉన్నట్లు పేర్కొంది. అలాగే అరెస్ట్, రిమాండ్లపై దర్యాప్తు.. ఎన్నికల సమయాన్ని బట్టి కాకుండా చట్టబద్ధంగా జరుగుతుందని, సాక్ష్యాలను ఎలా రికార్డ్ చేస్తున్నారని అనుమానించడం అంటే కోర్టుతో పాటు న్యాయమూర్తిని తప్పుబట్టడమేనని వ్యాఖ్యానించింది.













