మధ్యాహ్న భోజనం కోసం రూ.7 కోట్ల 11 లక్షల సేకరణ
అక్షయ పాత్ర ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకొంది. భారత్లోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఆ సంస్థ అమెరికాలో ఆన్లైన్ ద్వారా రూ.7 కోట్ల 11 లక్షల విరాళాలను సేకరించింది. వర్చువల్ గాలా- టెక్నాలజీ ఫర్ చేంజ్ పేరుతో అక్షయ పాత్ర సంస్థకు చెందిన టెక్సస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని తన వంతు విరాళాలను అందజేశారు.
టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్, డాలస్, హ్యూస్టన్ నగరాల్లో జూలై 25న ఈ కార్యక్రమం జరిగింది. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఇటీవలే అక్షయ పాత్ర చైర్మన్గా నియమితులైన వెస్టర్న్ డిజిటల్ అధ్యక్షుడు శివ శివరాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్లోని 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 19,039 పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులకు రోజూ మధ్యాహ్నం భోజనం అందించే ఏకైక స్వచ్ఛంద సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్.













