అమెరికన్లూ వచ్చి పెట్టుబడులు పెట్టండి : పీయూశ్ గోయల్
భారత్ ఇపుడు ఒక అవకాశాల గనిగా మారిందని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన న్యూజెర్సీలో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ, అమెరికా కంపెనీల సరఫరా వ్యవస్థలో, పెట్టుబడుల ఫోర్ట్‌ఫోలియోలో ఒక విశ్వసనీయ భాగస్వామిగా మారగలదనీ ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ అవతరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెను మార్పులకు ఊతమిచ్చే సంస్కరణలు, యువ జనాభా కలిసి భవిష్యత్ వృద్ధికి బాటలు వేస్తాయని అన్నారు. ప్రపంచానికి ఈ సందేశాన్ని మీరు తీసుకెళ్లండి. అమెరికా, అమెరికా కార్పొరేటర్లకు వినిపించండి. మీ పెట్టుబడుల్లో, మీ వ్యాపారాల్లో మీకు ఒక విశ్వనీయ భాగస్వామిగా భారత్ ఉండగలదని ఇక్కడి భారత్-అమెరికా వర్గాల నుద్దేశించి పేర్కొన్నారు. అమెరికా, భారత్‌ల మధ్య బలమైన అనుబంధం, స్నేహం ఉంది. వ్యాపార, వాణిజ్య ఆర్థిక అంశాల్లో ఇరు దేశాలకు భారీ ప్రయోజనాలకు అవకాశం ఉంది. మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉండడం మాకు చాలా సంతోషమైన విషయమని గోయల్ అన్నారు.













