ల్యాబ్ నుంచి కాదు.. గబ్బిలాలా నుంచే!
ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తున్న కరోనా వైరస్ మొదట గబ్బిలాల నుంచే మనుషులకు సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), చైనా శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అభిప్రాయపడ్డారు. 2019 డిసెంబర్- 2020 జనవరి మధ్యకాలంలో చైనాలోని వుహాన్‌లో సార్స్ కోవ్-2 వైరస్‌ను మనుషుల్లో గుర్తించిన విషయం తెలిసిందే. వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌నుంచే వైరస్ లీక్ అయిందని అమెరికా మొదటి నుంచీ ఆరోపిస్తున్నది. వైరస్ ల్యాబ్‌నుంచి లీక్ అయిందనే వాదనను శాస్త్రవేత్తలు తిరస్కరించారు. అనేకసార్లు వాయిదా పడిన తర్వాత ఈ అధ్యయన నివేదికను అనధికారికంగా విడుదల చేశారు. అయితే దీనిపై స్పందించేందుకు డబ్ల్యూహెచ్‌వో నిరాకరించింది.
ఈ రిపోర్టు విడుదల కాకముందే అమెరికా దానిని తిరస్కరించింది. రిపోర్టును చైనా తన పలుకుబడితో మార్చే ప్రయత్నం చేస్తున్నదని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ విమర్శించారు. బ్లింకెన్ విమర్శలను చైనా తిప్పికొట్టింది. అమెరికానే డబ్యూలహెచ్వో సభ్యదేశాలపై ఒత్తిడి తెచ్చి ఈ రిపోర్టును మార్చే ప్రయత్నం చేసిందని ఎందుకు అనుమానించకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రశ్నించారు.













