అమెరికాలో యువకుడి వీరంగం
అమెరికాలోని పద్దెనిమిదేళ్ల యువకుడు మూడు తుపాకులతో విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృత్యువాతపడగా, ఇద్దరు పోలీసు అధికారులు సహా ఆరుగురికి గాయాలయ్యాయి. న్యూమెక్సికో, అరిజోనా, ఉటా, కొలరాడొ రాష్ట్రాల సరిహద్దులు కలుసుకునే ఫోర్ కార్నర్స్ ప్రదేశానికి దగ్గర్లో ఉన్న ఫార్మింగ్టన్ నగరంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. యువకుడు తుపాకులతో తిరుగుతూ వాయవ్య న్యూమెక్సికో సంఘం ప్రాంతంలో కార్లు, ఇళ్లపైకి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫార్మింగ్టన్ పోలీసు అధికారులు రంగంలోకి దిగి అతణ్ని కాల్చిచంపారు. కాల్పులకు తెగబడిన యువకుడి కుటుంబసభ్యులతో దర్యాప్తు అధికారులు మాట్లాడారు. అయినప్పటికీ కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ఇప్పటీకీ తెలియరాలేదు. కాల్పుల ఉదంతంలో ఆరు నివాసాలు, మూడు కార్లు దెబ్బతిన్నాయి.













