ఆ దేశానికి ఎల్లప్పుడూ అండగా… అగ్రరాజ్యం

కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్‍కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా మరోసారి హామీ ఇచ్చింది. తమ కీలక భాగస్వామికి అన్ని విధాల సహాయ సహకారాలు కొనసాగిస్తామని శ్వేతసౌధం ప్రకటించింది. కొవిడ్ పోరులో భారత్‍కు అమెరికా ఇప్పటికే 100 మిలియన్ డాలర్ల విలువైన సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కార్యక్రమాలను అధ్యక్షుడు దగ్గరుండి చూసుకుంటున్నారని వైట్‍హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు. మా కీలక భాగస్వామి అయిన భారత్‍కు మేం చేయగలిగిన సాయం చేస్తున్నామన్నారు. ఈ విపత్కర సమయంలో భారత్‍కు అన్ని విధాల అండగా ఉంటూ సాయం కొనసాగిస్తాం. ఆ దేశానికి ఏం అవసరముందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. భారత్‍లో కొవిడ్ కేసులు, మరణాలు తగ్గడంతో, అక్కడి ప్రజలకు మహమ్మారి నుంచి ఉపశమనం కల్గించడంలో మేం నిర్మాణాత్మక పాత్ర పోషించగలమని సాకీ తెలిపారు.