భారీగా పడిపోయిన హెచ్ 1 బీ వీసాలు
ఈ ఏడాది హెచ్ 1 బీ వీసాలు మాత్రం భారీగా పడిపోయాయి. ఈ దశాబ్దంలోనే అత్యంత తక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు. కరోనా ముప్పు నేపథ్యంలో అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించడం, వీసాలపై పరిమితులు పెట్టడం, లాక్డౌన్ వంటి కారణాలతో హెచ్ 1 బీ వీసాలు తగ్గాయి. విదేశీ ఇంజినీరింగ్, మ్యాథ్స్ ఉద్యోగుల హెచ్ 1బీ వీసాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12.6 శాతం తగ్గాయి. యేటా ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నా, ఈ ఏడాది మాత్రం వీసాలు తగ్గడం విశేషం.
2019లో కరోనా ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఇంజినీరింగ్, మ్యాథ్స్ సెక్టార్లో హెచ్ 1బీ ఉపాధి వీసాలు 19 శాతం పడిపోయాయని పేర్కొంటున్నారు. సెప్టెంబరు నాటికి పూర్తయిన అమెరికా ఆర్థిక సంవత్సరంలో అన్ని ఉద్యోగాలకు సంబంధించి 4.97 లక్షల వీసాలు ఇచ్చారని, 2020తో పోలిస్తే 9 శాతం 2019తో పోలిస్తే 17 శాతం తగ్గాయి. ప్రధానమైన కోర్సులుగా చెప్పుకొనే స్టెమ్స్కు సంబంధించిన ఉద్యోగాల వీసాలే భారీగా తగ్గాయని, 2020 మార్చి నుంచి గణనీయంగా పడిపోయాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎకనామిక్స్ ప్రొఫెసర్ జియోవానీ పెరి తెలిపారు.













