అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం జరిగింది. అక్కడ ఉన్న 14 అడుగుల ఎత్తయిన గోడ మీది నుంచి 3, 5 ఏళ్ల వయస్ను ఇద్దరు చిన్నారులను స్మగ్లర్లు కిందికి పడేశారు. అర్థరాత్రి వేళ జరిగిన ఈ ఘటన కెమెరాలో రికార్డవడంతో అలర్టయిన యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు వెంటనే ఆ ఇద్దరు చిన్నారులను రక్షించారు. శాంటా థెరెసాకు చెందిన ఓ ఏజెంట్ కెమెరా పుటేజీని పరిశీలిస్తుండగా, ఈ ఇద్దరు చిన్నారులను స్మగ్లర్లు గోడ మీది నుంచి పడేయడం గమనించినట్లు సీబీపీ వెల్లడించింది. ఈ ఇద్దరు చిన్నారులు ఈక్వెడార్‌కు చెందిన వాళ్లు. వీళ్లను సీబీపీ అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించడం కోసం అమెరికా ఏజెంట్లు, మెక్సికో అధికారులతో సంప్రదిస్తున్నారు. ఒకవేళ సరిహద్దులో ఎప్పటికప్పుడు నిఘా ఉండి ఉండకపోతే ఆ చిన్నారులు ఎడారిలో దారుణమైన పరిస్థితులను చవిచూశేవారని సీబీపీ తెలిపింది.













