కింగ్ చార్లెస్ ను కలిసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇటీవల కన్నుమూసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భౌతికాయానికి సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారత్ తరపున నివాళులు అర్పించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బకింగ్ హామ్ ప్యాలెస్‌లో రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కింగ్ ఛార్లెస్-3ని ద్రౌపది ముర్ము కలుసుకున్నారు. లాన్‌కాస్టర్ హౌజ్‌లో ఉన్న నివాళి బుక్‌లో ద్రౌపది సంతకం చేశారు. వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 పార్దీవదేహానికి కూడా ముర్ము నివాళులు అర్పించారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శనివారం నాడు ముర్ము లండన్ చేరుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు సుమారు 500 మంది ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ చక్రవర్తి నరుహితో, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసో తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.













