నార్వే రచయితకు సాహిత్య నోబెల్
నార్డిక్ దేశాల సాహిత్యంలో అద్భుతమైన నాటకాలు, నవలలు, చిన్న పిల్లల కథలు రాసిన ప్రముఖ రచయిత జాన్ ఫోసెను 2023 సాహిత్య నోబెల్ వరించింది. నార్వేకు చెందిన జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్‌కు ఎంపిక చేశామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ లిటరేచర్ కమిటీ ప్రకటించింది. వినూత్న నాటకాలు, గద్య పద్య రచనలు చేశారు. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు ఆయన తన రచనల ద్వారా స్వరాన్ని ఇచ్చారు. మానవ అభద్రత, చింత, ఆతృత, ఆందోళన మొదలైన వాటికి ప్రాధాన్యం ఇచ్చారు అని నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ అండర్స్ ఒల్సాన్ అన్నారు. ఆయన రాసిన 40 వరకు నాటకాలు, నవలలు, చిన్న పిల్లల కథలు డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్లినాండ్, ఐస్లాండ్ దేశాల్లో ఎంతో గానో ఆదరణ చూరగొన్నాయి. ద నేమ్, డ్రీమ్ ఆఫ్ ఆటం, ఐయామ్ విండ్ నాటక ప్రదర్శనలు యూరప్, అమెరికాలో చాలా పాపులర్.













