కాలిఫోర్నియాలో కలకలం… గాంధీ విగ్రహం ధ్వంసం
జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశమంతా దివంగత నేతను స్మరించుకుంటున్న వేళ అమెరికాలోని కాలిఫోర్నియాలో కొందరు దుండగలు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఆరడుగుల ఎత్తు, 294 కేజీల బరువైన కాంస్య విగ్రహాన్ని ఉత్తర కాలిఫోర్నియాలో నాలుగేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా పంపింది. శాంతి, సమన్యాయం కోసం పోరాడి ప్రపంచవ్యాప్తంగా మన్ననలందుకున్న నేత విగ్రహంపై దాడి అమానుషమని అమెరికా వ్యాఖ్యానించింది.
ఈ ఘటన పట్ల అమెరికాలో ఇండో-అమెరికన్ల నుంచి తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాగా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంపై విచారణ కోరేందుకు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లిందని భారత్ పేర్కొంది. గత ఏడాదిలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు అపవిత్రం చేశారు.













