అమెరికాలో బాంబ్ తుపాను బీభత్సం
అమెరికాలో బాంబ్ మంచు తుపాను బీభత్సానికి బలైన వారిలో సింహభాగం కార్లలోనే తనువు చాలించినట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. తుపాను కొంత తెరిపినివ్వడంతో సహాయక చర్యలకు సైన్యం రంగంలోకి దిగింది. ఈ మూడు రోజుల్లో చనిపోయిన వారి సంఖ్య 63కు పెరిగిందని అధికారులు తెలిపారు. సహాయక బృందాలు హైవేలు, రోడ్లపై పేరుకుపోయిన మంచుల్లో కార్లను గుర్తిస్తున్నాయని, వాటిల్లో మృతదేహాలను వెలికితీస్తున్నాయన్నారు. దాదాపు 45 మృతదేహాలు కార్లలోనే కనుగొన్నట్లు వెల్లడించారు. క్రిస్మస్ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణమైనవారే ఇలా హైవేల్లో తను చాలించారని పేర్కొన్నారు. న్యూయార్క్ పశ్చిమ ప్రాంతమైన బఫెలో పట్టణంలోని ఎరీకంట్రీలోనే 28 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న న్యూయార్క్‌లో అత్యయిక స్థితిని ప్రకటించినట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ప్రకృతి విపత్తును ఎదుర్కొంటున్న న్యూయార్క్ రాష్ట్రానికి అన్ని విధాల సహకరిస్తామని బైడెన్ హామీ ఇచ్చినట్లు తెలిపాయి.













