పహల్గాం ఉగ్రదాడిలో హఫీజ్ సయీద్ హ్యాండ్.. ఛార్జిషీట్ లో చేర్చిన ఎన్ఐఏ
పహల్గాం ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ తాజాగా ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ ఎల్ఈటీ అధినేత, మోస్ట్ వాంటెండ్ ఇస్లామిక్ ఉగ్రనేత హఫీజ్ సయీద్‌పై పలు అభియోగాలతో ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. సయీద్‌ను అతని వ్యక్తిగత హోదాలోనే కాకుండా, లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ TRF అధినేతగా కూడా NIA నిందితుడిగా చేర్చింది.
ఉపా చట్టంతో పాటు భారతీయ న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఎల్ఈటీ, టీఆర్ఎఫ్లపైనా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పహల్గాం ఉగ్రదాడి ప్రణాళిక, నిధులు సమకూర్చడం వెనుక ఈ ఉగ్ర సంస్థలు ఉన్నాయని పేర్కొంది.
సరిహద్దుల అవతలి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కుట్రలను, ఈ కేసులో హఫీజ్ సయీద్ పాత్రను శాస్త్రీయ, క్షేత్రస్థాయి ఆధారాలతో సహా ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. హఫీజ్ సయీద్‌పై BNS 2023తో పాటు ఉగ్రవాద నిరోధక చట్టం 1967లోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, సరిహద్దు అవతలి నుంచి ఉగ్రదాడులకు వ్యూహాత్మక కుట్రలు పన్నడం వంటి తీవ్రమైన ఆరోపణలను చార్జ్‌షీట్‌లో NIA మోపింది.








