ఆ దేశంలోని భారతీయులకు కేంద్రం సూచన
ఖలిస్థానీ అంశం, ట్రూడో ఆరోపణలతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. తాజాగా కెనడాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలోని పౌరులు, విద్యార్థులు, అక్కడకు ప్రయాణించాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తమ ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇండియా వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకిస్తున్న భారత కమ్యూనిటీ ప్రజలను, మన దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల కాలంలో బెదిరింపులు వస్తున్నాయి. అందువల్ల అలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని కోరుతున్నాం అని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.













