అమెరికా లో కరోనా మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. లక్షలాది మంది ఈ రక్కసి కోరల్లో చిక్కి ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలో ఇలా కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సాయం చేయాలని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజమెంట్ యాక్ట్(ఫెమా) నిర్ణయించింది. ఇటీవల అమెరికా ప్రభుత్వం చేసిన కరోనావైరస్ రెస్సాన్స్ అండ్ రిలీఫ్ సప్లిమెంటల్ అప్రోప్రియేషన్స్ చట్టం 2021, అమెరికన్ రెస్క్యూ ప్లాన్ యాక్ట్ 2021ను ఉపయోగించి కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఫెమా భావిస్తోంది. కరోనా సంబంధిత కారణాలతో మరణించిన వారి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాలని డిసైడ్ అయింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించిన ఫెమా.. అప్పటిలోగా అర్హులైన వారందరూ అవసరమైన ధ్రువపత్రాలు సేకరించి పెట్టుకోవాలని సూచించింది.
ఈ ఆర్థిక సాయం పొందడానికి కావలసిన అర్హతలు:
1. సదరు మరణం యూఎస్ భూభాగాలు మరియు కొలంబియా డిస్ట్రిక్ట్‌తో కలిపి యూఎస్‌లో సంభవించి ఉండాలి.
2. సదరు వ్యక్తి కరోనా సంబంధిత కారణాలతోనే మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రం(డెత్ సర్టిఫికెట్)లో పేర్కొనాలి.
3. దరఖాస్తు దారుడు 2020 జనవరి 20 తర్వాత అంత్యక్రియల కోసం ఖర్చు చేసిన యూఎస్ పౌరుడు, నాన్ సిటిజెన్ నేషనల్ లేక అర్హత పొందిన ఇతరులు అయ్యుండాలి.
4. మరణించిన వ్యక్తి యూఎస్ పౌరుడు, నాన్ సిటిజన్ నేషనల్ లేక అర్హత పొందిన ఇతరులు అయ్యుండాల్సిన అవసరం లేదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఏప్రిల్ నెలలో దరఖాస్తులు స్వీకరించాలని ఫెమా నిర్ణయించింది. దీనికోసం కింద పేర్కొన్న డాక్యుమెంట్లను సేకరించుకోవాలని అధికారులు చెప్పారు.
1. అధికారిక మరణ ధ్రువీకరణ పత్రం: సదరు వ్యక్తి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కానీ కరోనా సంబంధిత కారణాలతోనే మరణించినట్లు తెలిపే ధ్రువీకరణ పత్రం. యూఎస్ భూభాగాలు మరియు కొలంబియా రాష్ట్రం కూడా కలిపి యూఎస్‌లోనే ఈ మరణం సంభవించిందని పేర్కొనాలి.
2. అంత్యక్రియల ఖర్చుకు సంబంధించిన పత్రాలు: దరఖాస్తు దారుడు, మృతుడి వివరాలతోపాటు అంత్యక్రియలకు అయిన ఖర్చును సూచించే రిసీట్లు, ఫ్యూనరల్ హోమ్ కాంట్రాక్ట్ తదితర పత్రాలు. అంత్యక్రియలు జరిగిన తేదీ కూడా దీనిలో ఉండాలి.
3. ఇతరుల నుంచి స్వీకరించిన నిధులు: అంత్యక్రియల నిర్వహణ కోసం ప్రత్యేకంగా పొందిన నిధులకు సంబంధించిన రుజువు. బరీయల్ లేక ఫ్యూనరల్(అంత్యక్రియల) ఇన్సూరెన్స్, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, తదితర ఇతర వనరుల నుంచి ఆర్థిక సాయం పొందిన వారికి ఫెమా మరోసారి ఆర్థిక సాయం చేయలేదు.
అర్హత పొందిన వారికి పోస్టుద్వారా చెక్కులుగానీ లేక నేరుగా బ్యాంకు ఖాతాలోగానీ ఈ నిధులను అందజేస్తారు. ఏ విధానంలో సొమ్ము కావాలనే విషయాన్ని దరఖాస్తు సమయంలో ఎంచుకోవచ్చు.













