Saudi Arabia:: డొమెస్టిక్ వర్కర్స్కు ఇ-శాలరీ విధానం..సౌదీ కొత్త నిర్ణయం..!
సౌదీ అరేబియా (Saudi Arabia)లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్కు 2026 జనవరి 1 నుంచి ఇ-శాలరీ విధానం (e-salary for domestic workers) తప్పనిసరి చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వేతన రక్షణను మెరుగుపరచడం, పారదర్శకత పెంచడం, ఉపాధి ప్రక్రియలను క్రమబద్ధీకరించడం వంటి చర్యల్లో భాగంగా అన్నిరకాల డొమెస్టిక్ వర్కర్స్కు ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా జీతాలు పొందడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
నూతన చెల్లింపుల విధానంలో భాగంగా యజమానులు డొమెస్టిక్ వర్కర్స్కు నగదు రూపంలో జీతాన్ని చెల్లించడానికి బదులుగా గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా డిజిటల్ వాలెట్లను ఉపయోగించి నగదు బదిలీ చేయాలని (e-salary for domestic workers) మానవ వనరుల మంత్రిత్వ శాఖ సూచించింది.
ఈ చెల్లింపు డాక్యుమెంట్ల ఆధారంగా సమయం అయిపోకముందే కార్మికుల కాంట్రాక్టులను రద్దు చేయడం, ఇతర విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఒకవేళ కార్మికులు ఎలక్ట్రానిక్ చెల్లింపులు వద్దంటే.. వారి జీతాలను సరైన డాక్యుమెంటేషన్‌తో నగదు లేదా చెక్కు రూపంలో చెల్లించవచ్చని పేర్కొంది.






