ఇదో అందమైన దృశ్యం : చైనా
వాషింగ్టన్‌లోని కాంగ్రెస్ భవనంపై దాడి, హింసాత్మక ఘటనలపై ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తిం చేసింది. ట్రంప్ మద్దతుదారుల తీరును వివిధ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు అమెరికాకు అవమానకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం ఏదైనా గౌరవించాల్సిందేనని సృష్టం చేశారు. కాంగ్రెస్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి ఓ అందమైన దృశ్యం అని చైనా అభివర్ణించింది. 2019 జూలైలో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదులు సిటీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఆక్రమించుకొనే సమయంలో అమెరికా ప్రతిస్పందనను ఈ సందర్భంగా ఎత్తిచూపింది. నాడు అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ.. హాంకాంగ్‌లో నిరసనలను అందమైన దృశ్యాలుగా పేర్కొన్నారు. అప్పటి ఫొటోను, తాజా దాడి ఫొటోను పక్కపక్కన పెట్టి చైనా అధికార పత్రిక గ్లోబుల్ టైమ్స్ పోస్టు చేసింది. నాన్సీ పెలోసీ ఇప్పుడు కూడా అదే మాట అనగలరా అని ప్రశ్నించింది. నాడు హాంకాంగ్‌లో జరిగిందే ఇప్పుడు కాంగ్రెస్ భవనం వద్ద జరిగింది అని పేర్కొన్నది.













