ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపాలి : జై శంకర్
కెనడాలో ఖలిస్థాన్ ఏర్పాటువాద నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ భారత వైఖరిని స్పష్టం చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు తాము తోసిపుచ్చడం లేదన్నారు. అలాగే కెనడా దర్యాప్తునకు కూడా తాము వ్యతిరేకించడం లేదని తెలిపారు. అయితే ఈ వాదనలకు అనుగుణంగా బలమైన సాక్ష్యాలు తమ ముందుంచాలని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోపణలను మద్దతు ఇచ్చే ఎలాంటి ఆధారాలను భారత్తో కెనడా పంచుకోలేదని పేర్కొన్నారు.













