బందీలను వదిలితేనే… యుద్ధ విరామం : బైడెన్
రంజాన్ మాసారంభం లోగానే యుద్దానికి విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే ముందుగా హమాస్ మిలిటెంట్లు కొందరు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు అంగీకరించాల్సి ఉందన్నారు. తాత్కాలిక విరమణ సమయంలో మిగతా బందీల విడుదలతో పాటు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను మరికొందరిని విడుదల చేయడానికి సంబంధించి చర్చలు జరుగుతాయన్నారు. వచ్చే వారం నుంచి ఒప్పందం అమల్లోకి రావచచని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, ఈజిప్టు, ఖతార్ల మధ్యవర్తిత్వంతో రూపుదిద్దుకుంటున్న ఈ ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని హమాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ డిమాండ్లపై పునరాలోచన ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. బైడెన్ తెలిపిన అంశాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించలేదు. మార్చి 10న రంజాన్ మాసం మొదలుకానుంది.













