ఉక్రెయిన్లో మరో భారత విద్యార్థిపై కాల్పులు
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే వుంది. ఇంకా వందలాది మంది విద్యార్థులు తమకు సాయం అందడం లేదంటూ ఆవేదన చెందుతూ వీడియోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో భారత విద్యార్థి కాల్పుల్లో గాయపడ్డాడంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ తెలిపారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రి ప్రస్తుతం పోలాండ్లో వున్నారు. ఇప్పటి వరకు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ వీడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా చాలా మంది అక్కడ వున్నారని, ఈ తరలింపు క్రమం కొనసాగుతోందని తెలిపారు. మరింత మందిని తీసుకువచ్చేందుకు మరో 16 విమానాలను సిద్ధంగా వుంచినట్లు అధికారులు తెలిపారు.













