వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ మరో ముందడుగు
కరోనా వ్యాక్సిన్ తయారీ రేసులో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. కొవాక్సిన్ నెల రోజుల్లోనే తొలి దశ ప్రయోగ పరీక్షలను పూర్తి చేసుకొని రెండోదశలోకి ప్రవేశించింది. కొవిడ్ 19 ఎండ్‌గేమ్ సినేరియోస్ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో చెన్నై ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యులతో భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కృష్ణ ఎల్లా మాట్లాడారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం తమపై ఎంతో ఒత్తిడి ఉందని, అయినా తయారీ పక్రియ వేగాన్ని ఇష్టానుసారం పెంచబోమని సృష్టం చేశారు. వ్యాక్సిన్‌ను ఎప్పటిలోగా విడుదల చేస్తారన్న ప్రశ్నకు తొందరపాటులో తప్పుడు వ్యాక్సిన్లు తెచ్చి ప్రజల ప్రాణాలు తీయాలని కోరుకోవడం లేదన్నారు. రోగుల ఆరోగ్యభద్రత, వ్యాక్సిన్ నాణ్యతలే పరమావధిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయోగాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.
భారత బయోటెక్నాలజీ, ఫార్మా కంపెనీలు అమెరికాకు చెందిన జీఎస్కే, సనోఫీల కంటే తక్కువేం కాదని చెప్పారు. గతంలో మన కంపెనీలను తక్కువగా అంచనా వేసిన వాళ్లంతా భారత గడ్డ నుంచి ఉత్పత్తి అయిన రోటా వైరస్, పోలియో తదితర వ్యాధుల వ్యాక్సిన్ల పనితీరును చూసి ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారని గుర్తు చేశారు. నాణ్యమైన, చౌక వ్యాక్సిన్ల అభివృద్ధికి చిరునామాగా భారత్‌ను మలిచిన ఘనత ఇక్కడి వ్యాక్సిన్ కంపెనీలకే దక్కుతుందని కృష్ణ ఎల్లా తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని కూడా పొందడం లేదన్నారు. గతంలో రోటావైరస్ వ్యాక్సిన్‌ను అమెరికా కంపెనీ జీఎస్కే 85 డాలర్లకు మార్కెట్లోకి తీసుకొస్తే.. ఆదే వ్యాక్సిన్ భారత్ బయోటెక్ ఒకే ఒక డాలర్‌కు విడుదల చేసింది.






