ఇంట్లోనే ఉంటున్నా అయినా సరే తప్పించుకోలేపోయాను – గాయని స్మిత
టాలీవుడ్ లో మరో సెలబ్రిటీకి కరోనా సోకింది. పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఈ గాయని స్వయంగా వెల్లడించింది. “కరోనాకి భయపడి ఇంట్లోనే ఉంటున్నాను కానీ నిన్నంతా పిచ్చిపిచ్చిగా గడిచింది. ఒకటే ఒళ్లు నొప్పులు. బాగా వర్కవుట్స్ చేయడం వల్ల వచ్చాయని అనుకున్నాను. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయించుకున్నాను. నా భర్త శశాంత్ కు, నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. మాకు పెద్దగా లక్షణాలేం లేవు.”
ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని బయటపెట్టింది సింగర్ స్మిత. తామంతా ఇంట్లోనే ఉన్నామని, జాగ్రత్తలు కూడా తీసుకున్నామని.. అయినా కరోనా తమ ఇంట్లోకి వచ్చేసిందని చెప్పుకొచ్చింది. త్వరలోనే కరోనాను జయిస్తానని, ప్లాస్మాను కూడా డొనేట్ చేస్తానని ధైర్యంగా చెబుతోంది ఈ గాయని.






