కరోనా కట్టడికి బ్రిటన్ బాటలో భారత్!

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఊహకందని విధంగా సాగుతోంది. ఇప్పటికే లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇది పీక్ స్టేజ్ కాదని.. మే మధ్యలో పీక్ స్టేజ్ కు వెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక పీక్ స్టేజ్ కు వెళ్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని భయపడిపోతున్నారు. కరోనాను కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం టీకానే. అందుకే దేశవ్యాప్తంగా వీలైనంత త్వరగా ఎక్కువ మందికి టీకా వేయాలని ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం బ్రిటన్ మార్గాన్ని అనుసరించాలనుకుంటోంది.
ప్రస్తుతం 45ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తోంది ప్రభుత్వం. ఎల్లుండి నుంచి 18 ఏళ్లు పైబడిన వారంతా టీకాలు వేసుకునేందుకు వీలుంది. అయితే డిమాండ్ కు సరిపడా టీకాలు ఉత్పత్తి కావట్లేదు. ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడుతోంది. మొదట్లో టీకాలపై పెద్దగా ఆసక్తి చూపని జనం.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతుండడంతో అలర్ట్ అయ్యారు. టీకాలు వేసుకునేందుకు ఎగబడుతున్నారు. దీంతో వ్యాక్సిన్లకు మరింత డిమాండ్ ఏర్పడింది. అందుకే మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయలేమని పలు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. 45 ఏళ్లు పైబడినవాళ్లకు మొదట అందిస్తామని చెప్తున్నాయి.
అయితే సెకండ్ వేవ్ మాత్రమే కాకుండా భవిష్యత్తులో థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు వ్యాక్సినేషన్ జరగాలని భావిస్తోంది. ఇందుకు బ్రిటన్ ఎంచుకున్న మార్గాన్ని ఫాలో అవ్వాలనుకుంటోంది కేంద్రం. బ్రిటన్ లో ఓ దశలో కేసులు బీభత్సంగా నమోదయ్యాయి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థుతులనే బ్రిటని చవిచూసింది. అయితే ఇప్పుడు బ్రిటన్ సేఫ్ జోన్ లో ఉంది. ఎందుకంటే అక్కడ అందరికీ తొలివిడత వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. రెండో విడత వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. తొలి విడత వ్యాక్సినేషన్ తోనే అక్కడ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.
భారత్ లో ఇప్పటివరకూ 12 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. 18 ఏళ్ల పైబడిన వాళ్లు ఇంకో 80 కోట్ల మందికి పైగా ఉంటారని అంచనా. వీళ్లందరికి మొదటి విడత వ్యాక్సినేషన్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటోంది కేంద్రం. ఫస్ట్ డోస్ తీసుకున్నా కూడా 30 నుంచి 40 వరకూ కరోనా బారిన పడకుండా ఉండొచ్చని సర్వేలు చెప్తున్నాయి. అందుకే ఫస్ట్ డోస్ ను కంప్లీట్ చేసి.. సెకండ్ డోస్ గ్యాప్ పెంచాలనుకుంటోంది ప్రభుత్వం. సెకండ్ డోస్ ను ఇప్పుడు కోవాగ్జిన్ అయితే 28 రోజులు, కొవిషీట్ల్ అయితే 6-8 వారాలకు వేస్తున్నారు. ఈ గ్యాప్ ను మరింత పెంచడం ద్వారా ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ టీకా ఇచ్చేయొచ్చని భావిస్తోంది. ఫస్ట్ డోస్ అందరికీ పూర్తయితే వైరస్ ను దాదాపు కంట్రోల్ చేయొచ్చని అంచనా వేస్తోంది. బ్రిటన్ లో ఇలాగే వైరస్ అదుపులోకి వచ్చింది. ఇప్పుడు బ్రిటన్ బాటలోనే భారత్ పయనించాలనుకుంటోంది.