పండుటాకులకు నిండు భరోసా!
అమెరికాలో రూపొందిన మరో కొవిడ్ వ్యాక్సిన్ వృద్ధులకు సురక్షితమే కాకుండా, వారిలో శక్తిమంతమైన రోగనిరోధక స్పందనలను కూడా కలుగజేస్తున్నట్టు తేలింది. మహమ్మారికి ఎక్కువగా బలవుతున్న పండుటాకులను ఈ వ్యాక్సిన్ ద్వారా కాపాడుకోవచ్చన్న ఆశలు రేకెత్తుతున్నాయి. అమెరికా జాతీయ అలెర్జీ, సాంక్రమిక వ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ), బయోటెక్ కంపెనీ మోడెర్నా సంయుక్తంగా ఎంఆర్ఎన్ఏ-1273 అనే వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. తొలిదశ క్లినికల్ పరీక్షల్లో భాగంగా దీన్ని 40 మంది వృద్ధులకు రెండు డోసులుగా ఇచ్చి చూశారు. వీరిలో 20 మంది 56-70 ఏళ్ల వయసువారు కాగా, మరో 20 మంది ఆపైవయసు వారు. కొద్దిరోజుల తర్వాత ఈ వృద్ధుల్లో కరోనా వైరస్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు.






