భారత్ అడుగుతున్నా.. వ్యాక్సిన్ ముడిసరుకులపై బ్యాన్ పై నోరుమెదపని అమెరికా!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన కొన్ని ముడిపదార్థాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆ వస్తువులను ఎగుమతి చేయడానికి అగ్రరాజ్యం సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ ఎగుమతులపై బైడెన్ సర్కారు బ్యాన్ విధించినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పష్టతనిచ్చి, ముడుసరుకుల ఎగుమతికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఎప్పుడు వస్తాయి? అని ప్రశ్నించగా అమెరికా ప్రభుత్వం సమాధానం దాటవేసింది. వైట్‌హౌస్‌లో సోమవారం నాడు జరిగిన మీడియా సమావేశాల్లో రెండు సార్లు ఈ ప్రశ్న లేవనెత్తినా అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సంతృప్తికర సమాధానమూ రాలేదు.
‘కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల ఎగుమతిపై బైడెన్ సర్కారు బ్యాన్ విధించిందని, ఈ నిషేధం ఎత్తేస్తే వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం అవుతుందని భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చెప్తోంది. ఏ ముడిసరుకుల గురించి ఈ ప్రకటన వచ్చింది? ఈ విషయంలో అమెరికా సమాధానం ఏంటి?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సోమవారం ఉదయం జరిగిన కరోనా బ్రీఫింగ్ సమయంలో అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ డైరెక్టర్ డాక్టర్ ఆంథొనీ ఫాసీ, వైట్‌హౌస్ కొవిడ్-19 రెస్పాన్స్ సీనియర్ సలహాదారు డాక్టర్ ఆండీ స్లాసిట్.. ఇద్దరూ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రశ్నకు సమాధానం తమ దగ్గర ప్రస్తుతానికి లేదని, దీని గురించి మరోసారి చర్చిద్దామంటూ సమాధానాన్ని దాటవేశారు. అదేరోజు సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకికి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆమె కూడా ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా డబ్ల్యూటీవో వేదికగా యూఎస్ వాణిజ్య విభాగం ప్రతినిధి కేథరీన్ టాయ్ ఇచ్చిన ప్రసంగాన్ని ప్రస్తావించారు.
‘కరోనా సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తేడాను స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఏమాత్రం అంగీకారకారయోగ్యం కాదు. కష్టకాలంలోనే అద్భుతమైన నాయకత్వం, సృజనాత్మకత, కమ్యూనికేషన్ అన్నీ అవసరం అవుతాయి’ అని కేథరీన్ చెప్పారు. ఇవే మాటలను జెన్ సాకి కూడా వల్లెవేశారు. వీరి ప్రవర్తనను గమనించిన నిపుణులు.. భారత్‌కు కావలసిన ముడిసరుకులపై బైడెన్ సర్కారు నిషేధం ఎత్తేసే యోచనలో ప్రస్తుతానికి లేదనే విషయం స్పష్టం అవుతోందని అంటున్నారు.