దేశంలో 46 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 46 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 97,661 కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985కు చేరింది. గత 24 గంటల సమయంలో 1,201 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 77,472కు పెరిగింది. దేశంలో కరోనా నుండి ఇప్పటివరకు 36,24,197 మంది కోలుకున్నారు. 9,58,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్న తొమ్మిదిరాష్ట్రాల్లో 74 శాతం కేసులు నమోదవడం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధప్రదేశ్ రాష్ట్రాలు 48 శాతం కంటే ఎక్కువ యాక్టివ్ కేసులను కలిగి ఉన్నాయి. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 77.65 శాతం కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 81,035 మంది కరోనా నుండి కోలుకున్నారు.






