అమెరికాలో 22 రాష్ట్రాల్లో భారీగా కేసులు
అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఆ దేశంలో కరోనా బారిన పడి ఇప్పటికే దాదాపు లక్ష 89 వేల మందికి పైగా మరణించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇదే సమయంలో 22 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. కరోనా కొత్త కేసుల నమోదు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మిడ్వెస్టు, సౌత్ ప్రాంతాలకు చెందినవే కావడం గమనార్హం. గత వారాలతో పోల్చి చూసుకుంటే దక్షిణ దకోతా రాష్ట్రంలో భారీ సంఖ్యలో తాజా కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిసింది. గత రెండు వారాల్లో ఈ రాష్ట్రంలో 3,700 మేర కొత్త కేసులు వచ్చాయి. ఇది అంతకుముందుటి రెండు వారాలతో పోల్చుకుంటే 126 శాతం అధికం. అధిక జనాభా కలిగిన ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.






