ఏపీలో 7,665 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరో 80 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 7,665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆ జిల్లాలో అత్యధికంగా 1,235 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 32,938 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో ప్రకాశం జిల్లాలో 11 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, కడప, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 2,116కు చేరింది.






