ఏపీలో లక్షకు చేరువలో కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి. మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7,627 మందికి కొవిడ్ నిర్ధారణయింది. కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా అత్యధికంగా కర్నూలులో 1,213 మందికి, తూర్పు గోదావరిలో 1,095, పశ్చిమగోదావరి జిల్లాలో 859 మంది కరోనా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 24 గంటల్లో కరోనా బారినపడి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కు, మొత్తం మరణాలు 1,041కు చేరాయి. శని, ఆదివారాల మధ్య తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ మంది చనిపోయారు.






