గ్రేటర్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల ఆగస్టు చివరి కల్లా గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి వస్తుంది. కేసులు కొద్ది రోజుల్లో ఇంకా తగ్గుతాయి. సెప్టెంబరు చివరికల్లా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వైరస్‌కు చెక్ పడుతుందని ఇవి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆగస్టు 25న ప్రకటించారు. అయితే ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు చివరి వారం నుంచి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రెట్టింపు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ పరీక్షలు అందుబాటులోకి రావడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. జనసంచారం ఒక్కసారిగా పెరగడం కూడా వైరస్ వ్యాప్తికి ఊతమిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
కరోనా కేసులు ఏ మలుపు తీసుకోనున్నాయి? పెరుగుతాయా? తగ్గుతాయా? అనే దానిపై ఓ అంచనాకు వచ్చేందుకు ఆగస్టు తొలి మూడు వారాల పాటు నమోదైన కేసుల తీరును వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. వాటి ప్రకారం తొలివారంలో 14,810 కేసులు రాగా, రెండోవారంలో కాస్త తగ్గి 12,746 పాజిటివ్ కేసులు వచ్చాయి. మూడో వారానికి వచ్చేసరికి కొంచెం పెరిగి 13,990కు చేరాయి. రాష్ట్రంలో బయటపడుతున్న పాజిటివ్ కేసులు ప్రాతిపదికగా సెప్టెంబరు చివరి వారం వరకు అదే ట్రెండ్ కొనసాగితే కరోనా నియంత్రణలోకి వచ్చేస్తుందని రాష్ట్ర సర్కారు అంచనాకు వచ్చింది.
ఆగస్టు మూడో వారం తర్వాత సీఎన్ మారింది. గత నెల 23 నుంచి రాష్ట్రంలో పరీక్షల సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. అప్పటివరకు రోజూ 20 వేల పరీక్షలే చేయగా సగటున 1,731 కేసులు వచ్చాయి. ఆగస్టు 23 నుంచి రోజు 40 వేలకు పైగా టెస్టులు చేస్తూ రెండు రోజుల వ్యవధిలోనే 19,945 పాజిటివ్‌లు రాగా, రోజుకు సగటున 2,493 కేసులు నమోదయ్యాయి. అయితే అదే ట్రెండ్ కొనసాగుతుందా? లేదా వేచిచూడాలి.






