టీకా తీసుకున్నా సోకుతున్న కరోనా… కానీ…!!

కరోనా మహమ్మారి కుమ్మేస్తోంది. దీంతో వ్యాక్సిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కూడా కరోనా సోకుతోందని తెలియగానే అందరిలోనూ మళ్లీ భయం మొదలైంది. వైరస్ నుంచి వ్యాక్సిన్ కాపాడుతుందనుకుంటే ఇలా అవుతోందేంటి.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ సోకితే పరిస్థితి ఏంటి.. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. వాళ్లలో 26వేల మందికి మళ్లీ వైరస్ సోకింది. మొదటి డోసు తీసుకున్నవాళ్లలో 21వేల మంది మళ్లీ వైరస్ బారిన పడగా.. రెండో డోసు తీసుకున్నవాళ్లలో ఐదున్నర వేల మందికి కరోనా సోకింది. అంటే కేవలం 0.035శాతంగా దీన్ని చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వారి శరీరంలో తగినన్ని యాంటిబాడీలు అభివృద్ధి చెందకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లాంటి వాటివల్లే వాళ్లు మళ్లీ కరోనా బారిన పడి ఉంటారు.
ప్రస్తుతం దేశీయంగా రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ టీకాలను ప్రభుత్వం అందిస్తోంది. వీటిలో ఇప్పటివరకూ కొవాగ్జిన్ ను కోటి 10 లక్షల మంది వేయించుకున్నారు. 93లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. 4వేల 208 మందికి మళ్లీ వైరస్ సోకింది. 17లక్షల 37వేల 178 మంది రెండో డోసు తీసుకోగా 695 మంది మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఓవరాల్ గా చూస్తే కేవలం 0.04శాతం మంది కొవాగ్జిన్ టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా మహమ్మారికి చిక్కారు. అంటే ప్రతి పదివేల మందిలో ఇద్దరి నుంచి నలుగురి వరకూ కరోనా బారిన పడ్డారు.
ఇక దేశీయంగా ఎక్కువమందికి అందుబాటులో ఉన్న టీకా సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్. దేశంలో ఎక్కువ మంది తీసుకున్న టీకా కూడా ఇదే. ఇప్పటివరకూ దీన్ని 11కోట్ల 60లక్షల మంది తీసుకున్నారు. 10 కోట్ల మందికి ఫస్ట్ డోస్ కంప్లీట్ కాగా.. మిగిలినవాళ్లు రెండో డోసు కూడా పూర్తి చేసుకున్నారు. మొదటి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17వేల 145 మంది, రెండు డోసులు పూర్తి చేసుకున్న కోటి 57లక్షల 32వేల 754 మందిలో 5వేల 14మంది మళ్లీ కరోనా వైరస్ కు చిక్కారు. ఓవరాల్ గా కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత 0.03శాతం మందికి కరోనా మళ్లీ సోకింది. అంటే ప్రతి 10 వేల మందిలో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు.
టీకా తీసుకున్న తర్వాత కూడా ఇలా వైరస్ బారిన పడుతుంటే ఉపయోగం ఏముంటుందనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టీకా తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడిన వాళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించింది. టీకాలు వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తున్నాయని.. పరిస్థితి విషమించకుండా కాపాడుతున్నాయని తెలిపింది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించింది.