టీకా వస్తే ఏడాదిలోపు సాధారణ స్థితికి : ఫౌచి
కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికి లేదా 2021 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచి ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో కాకపోయినప్పటికీ, వ్యాధిపై సగం ప్రభావితంగా పనిచేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ఏడాదిలోపు ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నవంబర్ 3 నాటికి వ్యాక్సిన్ సిద్ధం కావచ్చన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. టీకా డోసులు సాధారణ ప్రజలకు చేరడానికి 2021 వరకు వేచిచూడాలన్నారు. రష్యా తీసుకొచ్చిన స్పత్నిక్ వీ టీకా గురించి మాట్లాడుతూ ప్రజలకు అందించాలన్న ఆతృత కంటే, వ్యాక్సిన్ సురక్షితమైనదో కాదో, ప్రభావితంగా పని చేస్తుందో లేదో చూడాలని అన్నారు. కాగా రష్యా టీకా భద్రత, పనితీరుపై ఆ దేశానికి చెందిన పలువురు నిపుణులే అనుమానాలను వ్యక్తం చేస్తుండటం తెలిసిందే.






