దేశంలో రికార్డు స్థాయిలో కేసులు
దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజూ 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 39 లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 83,341 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,36,748కు చేరింది. ఇందులో 8,31,124 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 30,37,152 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కరోనా బారినపడినవారిలో మరో 1096 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 68,472కు చేరింది. దేశంలో కరోనాతో ఇంతపెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిన్న 11,69,765 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 3 వరకు మొత్తం 4,66,79,145 నమూనాలను పరీక్షించామని తెలిపింది.






