ఆటా సేవలను ప్రశంసించిన వై.వి. సుబ్బారెడ్డి

కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించిన అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆటా మాతృదేశానికి చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా కూడా తనవంతు సహాయంగా ఆక్సిజన్ మిషన్లు ఇవ్వడం సంతోషంగా ఉంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా వారు తమ తోటి తెలుగువారి కోసం 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా పంపారు. ప్రస్తుతం 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
కాగా ఏపీ ఆటా ప్రతినిధి శివ భరత్ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ సెకండ్‍వేవ్‍తో ప్రజలంతా ఇబ్బందిపడుతున్న ఈ సమయంలో ఆటా తరపున తెలుగు ప్రజలకు సాయం చేయాలని ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల, కార్యదర్శి హరి ప్రసాద్ లింగాల కోరిక మేరకు ఎపిలో ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్స్లను పంపిణీ చేస్తున్నాము. ముందుగా 50 మెషిన్లు ఇచ్చాము. మిగతావి కూడా త్వరలోనే ఎపిలో పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి ఎంతో చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మేము కూడా సాయం చేస్తున్నామని శివ భరత్ రెడ్డి తెలిపారు.