అమెరికాలో దొంగల రాణి!
అగ్రరాజ్యంలో దొంగల ముఠాను ఏర్పాటు చేసుకుని నాలుగేళ్ల పాటు భారతీయ అమెరికన్ల, ఆసియా ప్రజల నివాసాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడిందో మహిళ. ఈ దురాగతాలపై విచారణ చేపట్టిన మిషిగాన్ న్యాయస్థానం ఎట్టకేలకు ఇటీవల ఆమెను దోషిగా తేల్చింది. హ్యుస్టన్కు చెందిన చాకో క్యాస్త్రో..ముఠాను ఏర్పాటు చేసుకుని 2011-2014 మధ్య దేశవ్యాప్తంగా భారీ చోరీలకు పాల్పడింది. ముఖ్యంగా జార్జియా, న్యూయార్క్ ఒహైయో, మిషిగాన్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లో భారతీయ అమెరికన్లు, ఆసియన్ల ఇళ్లను గుర్తించి తన ముఠా సభ్యులతో చోరీలకు తెగబడింది.
సాధారణంగా దొంగలంటే ఇళ్లలో దొరికిన విలువైన వస్తువుల్ని చోరీ చేస్తారు. కానీ ఆమె తీరే వేరు. ఏయే వస్తువులన్ని ఎత్తుకురావాలో ముందే జాబితాను రూపొందించి తన ముఠా సభ్యులకు పురమాయించేది. అంత కాదు ముందుగానే తన ముఠాకు ఓ ప్రాంతాన్ని నిర్దేశించేదట క్యాస్ట్రో. అక్కడ వారు రెక్కీ నిర్వహించి, తర్వాత చోరీలకు తెగబడేవారని న్యాయస్థానం తేల్చింది. చోరీలకు వెళ్లేటపుడు ముఠా సభ్యులు ముసుగులు ధరించి, ఆయుధాలను వెంట తీసుకెళ్లేవారు. ఇళ్లలోకి ప్రవేశించిన వెంటనే వాటిని ఎక్కుపెట్టి కుటుంబ సభ్యులను బెదిరించేవారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా వారిని తీవ్రంగా భయాభ్రాంతులకు గురిచేసేవారు. తర్వాత నగదు, ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ సామాగ్రిని ఎత్తుకుపోయెవారు అని న్యాయస్థానం తేల్చింది. గ్యాంగ్‌లీడర్ సహా ముఠా సభ్యులందరికి సెప్టెంబరులో శిక్ష విధించనుంది.













