Diversity Visa: 2028 వరకు యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీకి భారతీయుల అనర్హత!

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయులకు మరో షాక్ తగిలింది. యూఎస్ డైవర్సిటీ వీసా (Diversity Visa) లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గ్రీన్ కార్డ్ (Green Card) లాటరీగా పిలిచే ఈ కార్యక్రమంలో గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను మాత్రమే ఎంచుకుంటారు. ఏటా 50 వేల మంది లోపు అమెరికాకు వలసవచ్చే దేశాలకే ఈ లాటరీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ విధానం అమలు చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అధిక సంఖ్యలో వలసలు (Immigration) ఉండటంతో భారతీయులకు ఈ లాటరీకి కావాల్సిన అర్హత పరిమితి దాటిపోయింది. 2022లో ఏకంగా 1,27,010 మంది భారతీయులు అమెరికాకు వలస వచ్చారు, ఇది దక్షిణ అమెరికన్, ఆఫ్రికన్, యూరోపియన్ వలసదారుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. 2023లో కూడా 78,070 మంది వలస వచ్చారు. ఈ వలసల రికార్డుల ఆధారంగా 2028 వరకు భారతీయులు ఈ వీసా (Diversity Visa) లాటరీకి అనర్హులుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కఠినమవుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ వంటి దేశాలకూ 2026 వరకు ఈ లాటరీలో పాల్గొనేందుకు అర్హత లేదు.