డబ్ల్యుహెచ్ఓ నిజంగానే దాచిపెట్టిందా?…అమెరికా అనుమానాలు నిజమేనా?
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) వైఖరిపై అగ్రరాజ్యాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. కరోనా విషయంలో ముందుగానే హెచ్చరికలు చేయకుండా తరువాత చేయడం వెనుక ఉన్న ఒత్తిడి ఏమిటో చెప్పాలని అమెరికా నిగ్గదీసి అడుగుతోంది. దానికితోడు కరోనా మహమ్మారి భయంకరమైన వైరస్ అన్న విషయాన్ని చెప్పడంలో ఎందుకు జాప్యం చేశారన్నది కూడా చెప్పాలని అమెరికాతోపాటు కొన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను డిమాండ్ చేస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చైనాతో ఉన్న రాజకీయ ఒత్తిడివల్లే ఈ విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఈ సందర్భంగా వినవచ్చాయి. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, తైవాన్ వంటి దేశాలు కూడా డబ్ల్యుహెచ్ఓ వైఖరిపై గుర్రుమంటోంది.
ప్రపంచంలో ఎక్కడ అంటువ్యాధులు, మహమ్మారులు తలెత్తినా సభ్యదేశాలకు ఆ సమాచారాన్ని తక్షణం చేరవేసి, తీసుకోవలసిన జాగ్రత్తలు, అధునాత చికిత్స విధానాలు, పరిశోధనలు, ఔషధాల శాస్త్రీయ విధానాలపై జాగృతం చేయాల్సిన బాధ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థది. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం. 194 దేశాలు, 438కి పైగా స్వచ్ఛంద సంస్థలు, 7వేల మంది వైద్య, ఆర్థిక, సామాజిక నిపుణులు, విధాన రూపకర్తలతో నిండిన ఈ వైద్య ఆరోగ్య సంస్థపై నేడు అమెరికా విరుచుకుపడుతోంది. రెండవ ప్రపంచ యుద్దం దరిమిలా తలెత్తిన మశూచి, ఎల్లోఫీవర్, కలరా వంటి ప్రాణాంతక వ్యాధులవంటిని ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు ఏప్రిల్ 7, 1948లో దీనిని ఏర్పాటు చేశారు. ఎబోలా, సార్స్, హెచ్ 1ఎన్ 1 వంటి వైరస్ల దాడి సమయంలోనూ విమర్శలు ఎదుర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు తన చరిత్రలో ఎరుగని స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నది. కరోనా వైరస్ సృష్టిస్తున్న మారణ హోమం నేపథ్యంలో ఆ సంస్థకన్నా ముందుగానే దాని ప్రమాదాన్ని పసిగట్టి, సమాచారం వెల్లడైనా, దానిని విస్మరించడమే గాక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రమాదకర పరిణామాలను దాచిపెట్టిందన్న విమర్శలను సంస్థ నేడు ఎదుర్కొంటోంది. చైనా రాజకీయ ఒత్తిడివల్లే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అలా ఉపేక్షపూరిత వై•రిని అనుసరించారన్నది ప్రధాన విమర్శ. వాస్తవాలు అతిభయంకరంగా ఉండగా, దానిని తక్కువచేసి చూపించారన్నది రెండవ ఆరోపణ. నిన్న మొన్నటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే డబ్ల్యూహెచ్ఓ వైఖరిని గట్టిగా వ్యతిరేకిస్తూ నిధులు నిలిపివేయగా తైవాన్ కూడా కీలక ఆరోపణలు చేసింది. ఇప్పుడు వాటి సరసన ఆస్ట్రేలియా కూడా చేరింది. నిజానికి డబ్ల్యూహెచ్ఓకు పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్న దేశాల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సాధారణంగా తటస్ఠవైఖరిని అనుసరిస్తూ ఉంటుంది. కానీ కరోనా వైరస్ సృష్టించిన మారణ హోమం నేపథ్యంలో ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ పనితీరుపై అంతర్జాతీయంగా స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఆస్ట్రేలియా కూడా ప్రకటించడంతో చాలా దేశాలకు డబ్ల్యూహెచ్ఓ పనితీరు నచ్చలేదన్నట్లు కనిపిస్తోంది.
అమెరికా ఆరోపణ ఏమిటంటే వూహాన్‌లోని ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకయిందంటోంది. ముందుగానే కరోనా వైరస్ కు సంబంధించి తీవ్రత, మరణాలు, వ్యాప్తిపై సమాచారం ఇవ్వలేదని అంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది మరో ఆరోపణ. వూహాన్ వైరల్ ల్యాబ్‌లోనే వైరస్ పుట్టిందా అన్నదానిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ తాము ఆరోపించినట్లు ఇది లీకయినవైరస్ అయితే చైనాపై తగిన చర్యలు చేపట్టడం ?ఖాయమని ట్రంప్ అంటున్నారు. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ కు నిధులను నిలిపివేస్తూ ట్రంప్ కఠిన చర్యలు చేపట్టారు.
కాగా డబ్ల్యూహెచ్ఓ మొత్తం బడ్జెట్లో15-18 శాతం అమెరికా ఇస్తోంది. ఆ తరువాతి స్థానంలో బిల్‌గేట్స్, మిలిందాగేట్స్ ఫౌండేషన్ పెద్ద దాతగా ఉంది. జర్మనీకి చెందిన గావి. యూకె, ఫ్రాన్స్, కెనడా, ద.కొరియా, జపాన్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 160 కోట్ల జనాభా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న చైనా చాలా స్వల్పస్థాయిలో నిధులు ఇస్తోంది. అది చెల్లిస్తున్న మొత్తం డబ్ల్యూహెచ్ఓ బడ్జెట్ కేవలం 0.3 శాతం లోపే.. సభ్య దేశాలలో 21వ స్థానంలో ఉంది. అది చెల్లించే మొత్తం..భారత్, పాకిస్థాన్ ఇచ్చే నిధులకన్నా తక్కువే. ఈ నేపథ్యంలో తాము ఎక్కువ నిధులను వెచ్చిస్తున్నందున తమకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నందున ఆ హక్కుతోనే అమెరికా, ఆస్ట్రేలియాలు నేడు డబ్ల్యుహెచ్ఓను నిలదీస్తున్నాయి. కాని ఇప్పటివరకు దీనిపై సరైన విధంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ స్పందించలేదు.
ఆస్ట్రేలియా కూడా అమెరికా లేవనెత్తిన సందేహాన్నే వ్యక్తపరుస్తూ, చైనాలోని వూహాన్ నగరంలోని సజీవ మాంస విపణిలో కరోనా వైరస్ వ్యాప్తిలో వాస్తవాలు ఏదో తెలియజేయాలి. ఆ నగరంలో ల్యాబ్‌లో లీకయిందా, లేదా అన్న అనుమానాలను నివృత్తి చేయాలి. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై నిజానిజాలు వెల్లడి చేయాలి. చికిత్సలు, మరణాలపై చైనాతో పాటు ఇతర దేశాలు వాస్తవాలు వెల్లడించాలి. మనుషుల నుంచి మనుషులకు కరోనా వైరస్ సంక్రమిస్తుందన్న సమాచారం ఎందుకు పంచుకోలేదని ప్రశ్నిస్తోంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలలో పంచుకున్న సమాచారం ఎప్పుడు, ఏ వివరాలు ఇచ్చారో తేల్చాలని కోరింది. ఆ సంస్థకు ఏఏ దేశాలు, ప్రధానంగా చైనా ఏం చెప్పింది, ఎప్పుడెప్పుడు ఏ వివరాలు పంచుకుంది నిర్ధారించడంతోపాటు, మహమ్మారిగా ప్రకటించడంలో జాప్యమెందుకో తేల్చాలని కోరింది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పారదర్శకంగా వ్యవహరించిందా అన్నది అనుమానంగా కనిపిస్తోందని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. అంతర్జాతీయ స్వతంత్ర వ్యవస్థతో దీనిపై విచారణ జరిపించాలని ఆస్ట్రేలియా కోరుతోంది. అమెరికాతో ఈ విషయమై చర్చలు జరిపినట్లు కూడా చెబుతోంది.
తైవాన్ కూడా కొన్ని సందేహాలను లేవనెత్తింది. కరోనా తలెత్తిన వూహాన్‌కు అత్యంత సమీపంలో తైవాన్ ఉంది. డిసెంబర్ 31న దేశంలో తొలి కేసు నమోదైంది. సొంతగా కట్టడి చర్యలు తీసుకోవాలని తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ నిర్ణయించి ఆమేరకు చర్యలు చేపట్టారు. 2003లో చైనా నుంచి సంక్రమించిన సార్స్‌తో భారీ ప్రాణనష్టం చూసిన దేశం కనుక తైవాన్ ముందుగానే ఆ అనుభవంతో వైద్య నిపుణుల నుంచి కరోనా వైరస్‌పై సమాచారాన్ని సేకరించింది. సార్స్ కన్నా అతి తీవ్రమైన సమస్యలు ఈ వైరస్ ద్వారా ఉన్నట్లు నిర్దారించుకుంది. ఆ సమాచారాన్ని వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు మెయిల్. లేఖ ద్వారా తెలిపింది. కాని లేఖను అందుకున్న డబ్ల్యుహెచ్ఓ దానిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. మొదట మానవుల నుంచి మానవులకు కరోనా సంక్రమిస్తోందని వెల్లడైన విషయాన్ని ఖండించిన డబ్ల్యూహెచ్ఓ చివరకు అదే నిజమని ఒప్పుకుంది.
కాగా ఏదీ ఏమైనా అమెరికా ఇతర పాశ్చాత్య దేశాల ఆరోపణలు నిజమని తేలితే చైనా ఎలా ప్రతిస్పందిస్తుందన్న విషయాన్ని వేచి చూడాల్సిందే. ఈ ఆరోపణల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరుపై అపనమ్మకం మాత్రం అన్నీ దేశాలకు కలిగిందని చెప్పవచ్చు.













