శ్వేతసౌధంలో విందుకు అతిరథ, మహారథులు
భారత ప్రధాని మోదీ గౌరవార్థం శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన అతిరథ, మహారథులు హాజరయ్యారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో గొప్ప వ్యక్తులు, బిలియనీర్ వ్యాపారవేత్తలైన ముకేశ్ అంబానీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్ర, ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తదితరులు ఉన్నారు. మోదీ సూచనల మేరకు విందులో అధికశాతం శాకహార వంటలకే ప్రాధాన్యం ఇచ్చారు. వాటిలో చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్లు ఆతిథ్యమిచ్చిన స్టేట్ డిన్నర్‌కు 400 మందికి పైగా అతిథులను ఆహ్వానించారు. శ్వేతసౌధంలోని సౌత్ లాన్లో ఏర్పాటు చేసిన ఈ విందు కోసం ఆ ప్రాంతాన్నంతా ప్రత్యేకం అలంకరించారు. ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించిన ప్రసంగించిన ప్రధాని మోదీ, తాము నివసిస్తున్న దేశ సర్వతోముఖాభివృద్ధికి భారతీయ అమెరికన్లు ఎంతో కృషి చేస్తున్నారని, భారత్, అమెరికా భాగస్వామ్యం బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.













