White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్‌హౌస్ క్లారిటీ

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే హెచ్-1బీ వీసాల రుసుమును ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడం.. అది వార్షిక ఫీజు అంటూ ప్రచారం జరగడంతో భారత్ లో సాఫ్ట్ వేర్ రంగం ఉలిక్కిపడింది. తక్షణం యూఎస్‌కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ మెయిళ్లు పంపాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టతనిచ్చారు.
హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమనని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్‌టైమ్ లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్‌కు వర్తించదని చెప్పారు.
అమెరికా కాలమానం ప్రకారం 21వ తేదీ అర్ధరాత్రి 12.01 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే మన కాలమానం ప్రకారం సుమారు ఉదయం 9.31 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన సెప్టెంబర్ 21 కంటే ముందే దాఖలు చేసిన హెచ్1బీ వీసా పిటిషన్‌లకు వర్తించదని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది. హెచ్1బీ వీసా కేటాయించాలని కంపెనీలు అధికారికంగా చేసుకొనే దరఖాస్తును పిటిషన్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లు కూడా దీని పరిధిలోకి రావని వెల్లడించింది. ఇక ఇప్పటికే హెచ్1బీ వీసా చెల్లుబాటులో ఉన్నవారు కూడా అమెరికాకు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. ఈ మేరకు USCIS డైరెక్టర్ జోసఫ్ ఎడ్‌లో ఒక మెమోలో వెల్లడించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు తమ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వీసాదారుల ప్రయాణ హక్కులపై కొత్త నిబంధన ప్రభావం చూపదన్నారు.
భారత ఎంబసీ హెల్ప్‌లైన్ ఏర్పాటు..
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును భారీగా పెంచడంతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం +1-202-550-9931 నంబర్‌కు ఫోన్ లేదా వాట్సప్ చేయాలని సూచించింది. భారతీయులకు మాత్రమే అత్యవసర సాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. హెచ్1బీ వీసాల్లో అత్యధికంగా 72శాతం వరకు భారతీయులకే కేటాయిస్తున్నారు.