ఎవరు గెలిచినా భారత్ తో సంబంధాలు : మోర్గాన్
తమ దేశానికి, భారత్‌కు మధ్య సంబంధాలు రాజకీయ పార్టీలకు అతీతమైనవని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ పేర్కొన్నారు. అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఈ సంబంధాలు కొనసాగుతాయని సృష్టం చేశారు. ఇరు దేశాలకు సంబంధించిన రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రపంచ యవనికపై భారత్ కీలకమైన శక్తి అని అభిప్రాయపడ్డారు. భారత్ ఎదుగుదలను తాము స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు. అంతర్జాతీయంగా అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని వాటిని, భారత్‌తో కలిసి పరిష్కరించుకుంటామని తెలిపారు. అందుకు తమ దేశం సిద్ధంగా ఉందని సృష్టం చేశారు.
అదే విధంగా డ్రాగన్‌పై విమర్శలు గుప్పించారు మోర్గాన్. చైనా సృష్టించిన కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని పేర్కొన్నారు. వైరస్ పుట్టుకు సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలన్నారు. నిజ నిర్ధరణ కోసం వైద్యులు, శాస్త్రవేత్తలను చైనాలోకి అనుమతించాలని తెలిపారు.













