WATS: వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు
వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది (Ugadi) ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. బోతెల్ లోని నార్త్షోర్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. వాషింగ్టన్ నలుమూలల నుండి వచ్చిన తెలుగువాళ్ళు కుటుంబంతో సహా ఇందులో పాల్గొన్నారు. అధ్యక్షుడు రాజేష్ గూడవల్లి నేతృత్వంలో బోర్డు సభ్యులు మధు రెడ్డి, ప్రకాష్ కొండూరు, రామ్ తమ్మినేని, హరిని దేశరాజు, శివ వెదురుపాటి, శ్రీరామ్ పాటిబండ్ల తదితర కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈ వేడుక విజయవంతంగా నిర్వహించారు.
పూలతోరణాలు, సంప్రదాయ వస్తువులు, దీపాల వెలుగులతో సభాస్థలిని అలంకరించారు. ప్రవాసులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. వాసుదేవ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించి, విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలను వివరించారు. నృత్య ప్రదర్శనలు అలరించాయి. ముఖ్య అతిథి సినీ నటి ఐశ్వర్య రాజేష్ నృత్య ప్రదర్శన ఉత్సాహపరిచింది. అతిథులకు తెలుగు భోజనం, ఉగాది పచ్చడి వడ్డించారు. హరిత సిస్తా, రవి దశిక, సాయిరాం దేశరాజు తదితరులు సహకరించారు.








