నెల్లూరులో డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డికి ఘన సన్మానం… విశ్వ వైద్య విభూషణ్ బిరుదు ప్రదానం

అమెరికాలో తెలుగువారికి, తెలుగు సంఘాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రైమ్ హెల్త్ కేర్ అధినేత, డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్‌గా, ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అడ్వయిజరీ చైర్‌గా ఉన్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డికి నెల్లూరులో ఘనంగా సన్మానం జరిగింది. నెల్లూరుకు చెందిన డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి అమెరికాలో నేడు పేరున్న డాక్టర్‌గా, ఆసుపత్రి అధినేతగా పేరు తెచ్చుకున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలకు, తెలుగువారికి సహాయపడుతూనే, మరోవైపు జన్మభూమి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ఆయన నెల్లూరుకు వచ్చిన సందర్భంగా పౌర సన్మానాన్ని ఏర్పాటు చేసి ఆయనకు విశ్వ వైద్య విభూషణ్ బిరుదును బహుకరించారు.
వైద్యరంగంతో పాటు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా దాతృత్వాన్ని చాటుకుంటున్నందుకు ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, శాంతి దంపతులకు నెల్లూరులో పౌర సన్మానం ఏర్పాటు చేశారు. వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికైంది. నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ, డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి తెలుగు కమ్యూనిటీకి చేస్తున్న సేవలను కొనియాడారు. నాటా తరపున తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవే డేస్ పేరుతో పలు కార్యక్రమాలను చేసినట్లు తెలియజేశారు.
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంచెలంచెలుగా ఎదిగి మాతృభూమికిఅండగా నిలిచిన ప్రేమ్‌సాగర్‌రెడ్డి సేవలు అభినందనీయమన్నారు. విదేశాల్లోనూ తెలుగు వారి ఐక్యతకు కృషి చేస్తున్నారని కొనియాడారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రేమ్‌సాగర్‌రెడ్డి యువతకు ఆదర్శమైన వ్యక్తి అని కొనియాడారు.
డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో ఎదగాలనుకునే వారికి తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. తాను చదువుకునే రోజుల్లో పడ్డ కష్టాలు.. ఇప్పటి విద్యార్థులు పడకూడదనే విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ.. తన తర్వాత సేవా వారసత్వాన్ని కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవరావు, జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ పొట్లూరి స్రవంతి, నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామిరెడ్డి, సెక్రటరీ నారాయణ రెడ్డి గండ్రతోపాటు నాటా నాయకులు కలువాయి రాధాకృష్ణ, వెంకట రామిరెడ్డి, సుధ కొండపు తదితరులు పాల్గొన్నారు.











































































