తెలుగు భాషాభిమానిగా జీవితంలో మరపురాని సందర్భం – ముప్పవరపు వెంకయ్యనాయుడు
మలేషియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యములో నిర్వహించిన మలయాపురంబులో తెలుగు మధురిమలు కార్యక్రమం DXN సైబర్ విల్లే, సైబర్ జయ, మలేషియా లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ట్రేసరర్ సత్య మూర్తి గారు పాల్గొన్నారు.
వెంకయ్య నాయుడు గారు ఉదయం మలేషియా తెలుగు అకాడమీ ని సందర్శించి ఆ తరువాత మలయాపురంబులో తెలుగు మధురిమలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ
“మలయపురంబులో తెలుగు మధురిమలు” కార్యక్రమం వేదికగా మలేసియాలోని తెలుగు వారిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారంతా మన భాషకు, సంస్కృతికి వారధులుగా, ముందుతరాలకు అందజేసే సారధులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుండటం ఆనందదాయకం.
మలేసియా తెలుగు సంఘం 1960కి ముందు నుంచి తెలుగు సాంస్కృతికి వారసత్వం, భాషను సంరక్షించుకోవటమే గాక, ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు వారి గౌరవాన్ని నిలబెట్టటంలో కీలకపాత్ర పోషిస్తుండటం అభినందనీయం.
భారతీయ సంస్కృతి మనకు అందించిన విలువలను మనందరం కాపాడుకోవాలి. మన సంస్కృతిని కాపాడుకోవాలంటే అది మన భాషను కాపాడుకోవటం ద్వారానే సాధ్యమౌతుంది. భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజంశక్తివంతమౌతాయి.
సంప్రదాయం అంటే చక్కగా అందించటం అని అర్ధం. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసం భాగంగా ఉంటాయి. అభివృద్ధి గమనంలో ఈ రెండూ సమాంతరంగా పురోగమించాలే తప్ప, తిరోగమనం చెందరాదు. మన సంప్రదాయాన్నిపాటిస్తున్న కుటుంబాలు మనకు ఆదర్శం కావాలి.
వేషో భాషా సదాచారః రక్షణీయ మిదం త్రయం
అంధానుకర మన్యేషాం అకీర్తికర ముచ్చతే
“తమవైన వేషం, భాష, సదాచారం అనే మూడింటిని రక్షించుకుంటే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలా కాకుండా ఇతరుల వేషభాషలను గ్రుడ్డిగా అనుకరించటం వల్ల అపకీర్తి కలుగుతుందన్నది ఈ శ్లోకం భావం.
శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ప్రపంచంలోని అనేక దేశాలు సందర్శించాను. ప్రతి దేశంలోనూ జీవనోపాధి కోసం ఆయా దేశాలకు వెళ్ళి, అక్కడ మన గౌరవ మర్యాదలు కాపాడుతున్న భారతీయులను, ప్రత్యేకించి తెలుగు వారిని కలుసుకునే వాణ్ని. ఆయా దేశాల సంప్రదాయాలను గౌరవిస్తూ, మన సంప్రదాయాలను కాపాడుకుంటున్న వారిని చూస్తుంటే ఎంతో ఆనందం కలిగేది. అయితే నా ప్రస్తుతం మలేసియా పర్యటన ఈ ఆనందాన్ని మరింత పెంచటమే కాదు, జీవితంలో మరువలేని అనుభూతిని అందించింది. ఓ తెలుగు భాషాభిమానిగా మనసంతా నిండే విధంగా భాషా మృష్టాన్న భోజనాన్ని అందించింది. నాకు ఆనందాన్ని అందించిన మలేసియా తెలుగు అకాడమీ సందర్శన అనుభవాలను మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అకాడమీ కాదు… “మలేసియా తెలుగు భాషా మందిరం.” మలేసియా తెలుగు సంఘం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రావంగ్ లోని మలేసియా తెలుగు అకాడమీ ద్వారా వారు తెలుగు భాష సంస్కృతి, లలితకళలకు సంబంధించిన విద్యాబోధన చేయడమే గాక, ఆగ్నేయాసియాలో తెలుగు కేంద్రంగానూ ఈ సంస్థ సేవలను అందిస్తోంది. ఇక్కడి కుటుంబాల పిల్లలకు తెలుగు భాషను బోధించడానికి, వారిని తెలుగు సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దడానికి ఈ సంస్థ చేస్తున్న కృషి ముదావహం.
సాధారణంగా నా విదేశీ పర్యటనలో సమయంలో అధికారిక కార్యక్రమాలతో పాటు, స్ఫూర్తిని పెంచే విధంగా ఏవైనా సందర్శనలు ఉంటే బావుంటుందన్నది నా అభిప్రాయం. మలేసియా తెలుగు అకాడమీ సందర్శన కూడా అలా అనుకోకుండా ఏర్పాటు చేసిందే. మిగతా సంస్థల వలే వీరు కూడా భాష కోసం ఏదో సేవ చేస్తుంటారు. పైపెచ్చు విదేశీగడ్డ మీద ఇంత సేవ చేస్తున్న వీరిని అభినందిస్తే, వారికి ప్రేరణగా ఉంటుందని భావించాను. అయితే అక్కడకు వెళ్ళిన తర్వాత, ఇది సందర్శించి ఉండకపోయి ఉంటే, ఎంతో ఆనందాన్ని కోల్పోయి ఉండే వాణ్ని అనిపించింది. ఓ తెలుగు భాషాభిమానిగానే గాక, మాతృభాషలు మహోన్నతంగా వెలగాలి అనుకునే వ్యక్తిగా ఈ పర్యటనను నూరు శాతం ఆస్వాదించగలిగే అనుభూతులు లభించాయి.
జీవనోపాధి కోసం ఎప్పుడో కొందరు తెలుగు వారు మలేసియా వెళ్ళారు. అక్కడ మన భాషా సంస్కృతులను కాపాడుకుంటూ తమదైన గుర్తింపు సాధించుకుని అక్కడి వారితో సఖ్యంగా ఉంటూ, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ జీవిస్తున్నారు. వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు, మన సంస్కృతిని తెలియజేసేందుకు ఒకప్పుడు తెలుగు పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆనాటి ప్రభుత్వం ప్రత్యేకంగా తెలుగు పాఠశాలలు ఉండకూడదంటూ నియమం విధించింది. (ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మలేసియాలో 30 తెలుగు పాఠశాలలు ఉన్నాయి.) ఈ నేపథ్యంలో అక్కడి మలేసియా తెలుగు సంఘం, ఓ అకాడమీని ఏర్పాటు చేస్తే బావుంటుందని భావించింది. స్వర్గీయ శ్రీ పోలయ్యనాయుడు గారి నేతృత్వంలో అక్కడి ప్రజలంతా నెలా నెలా తమ ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా ఇస్తూ ఈ భవనం నిర్మాణం పూర్తి చేసుకున్నారు. మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు గారు సైతం ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ద్వారా సహకారం అందించారు. 2013 నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వీరికి అధికారికంగా సహకారం అందిస్తోంది. హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ప్రవేశిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అనే నాలుగు కోర్సులను ఏర్పాటు చేసి, చిన్నపిల్లలు మొదలుకుని పెద్దవారి వరకూ శిక్షణ అందిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమానికి తమ సహకారం అందిస్తున్న విశ్వవిద్యాలయం వారికి నా అభినందనలు.
మలేసియా తెలుగు అకాడమీని చూసిన వెంటనే నాకు ఇది ఓ సంస్థలా కనిపించలేదు. తెలుగు భాషకు కట్టిన మందిరం అనే భావన కలిగింది. ప్రతి ఊరికి ఓ దేవాలయం, ఓ వైద్యాలయం, ఓ విద్యాలయం, ఓ గ్రంథాలయం ముఖ్యమన్నది మన పెద్దల మాట. అదే విధంగా ఇది తెలుగు భాష, సంస్కృతుల కోసం నిర్మించిన ఓ ఆలయం అని చెప్పడానికి మాతృభాషాభిమానిగా గర్విస్తున్నాను. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుంచి ఉద్భవించిందన్నది భాషా వేత్తలు మాట. తెలుగు రాష్ట్రాలకు చుట్టూ మూడు శివలయాలు పెట్టని కోటగా మన వైభవాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నాయి. అందుకు గుర్తుగా ఈ అకాడమీని మూడు విభాగాలుగా నిర్మించారు. ఒక్కో విభాగానికి పంచభూతాలను సూచించే విధంగా 5 అంతస్థుల్లో వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా 12 రాశులకు చిహ్నంగా 12 పిరమిడ్లను ఈ అకాడమీ ముందు వైపు ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన సంస్కృతిని ఈ భవనం పరిపూర్ణంగా ప్రతిబింబిస్తోంది. అంతే కాకుండా చక్కగా గాలి, వెలుతురు ప్రసరించే విధంగా విశాలమైన తరగతి గదులు, వసతి, చర్చావేదికలు, నీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ వంటివి ఓ సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఇక్కడ శిక్షణార్థులకు ప్రశాంతమైన చక్కని వాతావరం కల్పించారు.
అకాడమీలోని పిల్లలు అలవోకగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ వంటి గీతాలతో ప్రారంభించి, శతక పద్యాలు, చాటు పద్యాలు, భాగవత పద్యాలను ఆలపించిన తీరు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎక్కడి మలేసియా… ఎక్కడి పోతన… గొప్ప సంకల్పం ఉంటే తప్ప ఇలాంటి అద్భుతాలు సాధ్యం కావు. “ఎవ్వనిచే జనించు…” అంటూ గజేంద్ర మోక్షంలోని భాగవత పద్యాన్ని ఓ పిల్లాడు ఆలపిస్తూ ఉంటే, ఆ ఘట్టమంతా మనసులో మెదిలింది. తెలుగులో మాట్లాడటానికి గర్వపడుతున్నామంటూ అక్కడి పిల్లలు చక్కని తెలుగు మాట్లాడుతుంటే ఆత్మానందం కలిగింది. అక్కడ తిరిగినంత సేపు పరాయి గడ్డ మీద ఉన్నామన్న భావన కలగలేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నామా అనిపించింది. ఇదంతా ఒక్కరోజులో సాధ్యమైనది కాదు. ఇందు కోసం వారు ప్రత్యేకంగా పుస్తకాలు అచ్చు వేసుకున్నారు. ఎన్నో వ్యయప్రయాసకోర్చి ఎన్నో పుస్తకాలను తెప్పించుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవడానికి ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వాలు చేస్తున్న పని కాదు, అక్కడి తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకున్నవి. వారి జీవనోపాధి కోసం అక్కడి భాషా, సంస్కృతులతో మమేకం అవుతూనే మనవైన భాషా, సంస్కృతులను వారు కాపాడుకుంటున్న తీరును చూసి ఆనందం కలిగింది. మాతృభాష, సంస్కృతుల పరిరక్షణ విషయంలో నా ఆలోచనలను ఈ అకాడమీ దాదాపుగా ప్రతిబింబించింది. భాషను పరిరక్షించుకోవటమే గాక, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారితో కలిసి అనేక కార్యక్రమాలను, మన పండుగలను ఘనంగా నిర్వహించుకుంటోంది.
ఈ స్ఫూర్తి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆదర్శం కావాలి. మాతృభాష, సంస్కృతుల పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలన్న నా ఆకాంక్ష వెనుక అంతరార్థం ఇదే. భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వాలు నిధులు అందించగలవు, గొప్ప భవనాలను నిర్మించగలవు. కానీ వాటిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవలసిన బాధ్యత ప్రజల మీదే ఉంటుంది. మలేసియా తెలుగు ప్రజలు వారే స్వచ్ఛందంగా చక్కటి భవనాన్ని నిర్మించుకుని, వినియోగించుకుంటున్నారు. మిగతా దేశాల్లోనూ తెలుగు వారు చొరవ తీసుకుని ఇలాంటి తెలుగు భాషా మందిరాలను నిర్మించుకోవాలి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ తరహా ఏర్పాట్లు ఉన్నాయి. మలేసియా తెలుగు అకాడమీ నుంచి మరింత ప్రేరణ పొందటం ఆవశ్యకం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ భాషా విభాగ అధిపతులు, అధికారులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, విద్యార్థులు మలేసియాలోని ఈ సంస్థను సందర్శించాలన్నది నా ఆకాంక్ష. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరి కృషిని ఓ సారి పరిశీలించాలి. ఎల్లలకు ఆవల ఉండి కూడా, వినూత్న పద్ధతుల్లో, సాంకేతికతను వినియోగించుకుంటూ తెలుగు భాషా బోధన చేస్తూ, మనదైన సంస్కృతిని పరిరక్షించుకుంటున్న వీరి చొరవను తెలుసుకోవాలి. వారిలాగా మనం కూడా విలక్షమైన బోధనా పద్ధతులను, సాంకేతిక పద్ధతులను అందించగలమేమో పరిశీలించాలి. మనవైన భాషా, సంస్కృతులకు వారసులుగా మన ముందు తరాలను తీర్చిదిద్దాలి.
పరాయి గడ్డ మీద ఉన్నా మన భాషా సంస్కృతులను మరువకుండా, మరుగున పడనీయకుండా పురోభివృద్ధి గమనంలో ముందుకు తీసుకువెళుతున్న మలేసియా తెలుగు సంఘాన్ని, వారికి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తూ, వీరి ప్రేరణతో తెలుగు భాషా, సంస్కృతులను ముందు తరాలకు చేరవేసేందుకు ప్రతిచోట ఇలాంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.













