అమెరికా తెలుగు పత్రిక “తెలుగు టైమ్స్” కి వంగూరి వారి ప్రశంసలు
మనం మన పని చేసుకుంటూ పోతూ ఉన్నా, అప్పుడప్పుడు ఎవరైనా మనల్నీ, మన పనులనీ గుర్తించి నాలుగు మంచి మాటలు ఏదో ఒక పత్రికా ముఖంగా వ్రాస్తే ..అదో తుత్తి…కదా!. అందులోనూ మరొక 16 మంది చాలా గొప్ప అమెరికా సాహితీ వేత్తలూ, తెలుగు భాషా సేవకుల మధ్య నా పేరు కూడా దూరిపోవడం తో “ఆ గౌరవానికి నేను తగుదునా, తగనా అనుకుంటున్నాను” అని ‘అతి వినయం” ప్రదర్శించకుండా ఆ సమాచారం మీకు చేరవేస్తున్నాను. నా డబ్బా నేనే కొట్టుకోవడం పరిపాటే అని మీకు తెలుసు కదా……కానీ ఈ సారి వేరు.
అయితే ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కాబట్టి….నేను కాక ఆ 16 మంది సంక్షిప్త జీవిత విశేషాలూ, భాషాసాహిత్యాలకి వారు చేసిన నిస్వార్ధ సేవల వివరాలూ చదివినప్పుడు నాకు మహానందం వేసింది. నేను “ హంసల్లో కాకిని కాదు కదా” అనే అనుమానమూ వచ్చింది. ఎంపిక అయిన వారిలో ఫలానా వారు కూడా ఉంటే బావుండేది అని కూడా అనిపించింది కానీ ఇలాంటి ఎంపికలు ఎప్పుడూ కత్తి మీద సాము లాంటివే కానీ గుర్తించబడిన ఆ పదహారుగురు ప్రముఖులలో ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరూ నాకు చాలా ఆత్మీయులే. అది నా అదృష్టం.
అసలు విషయం ఏమిటంటే…..
అమెరికాలో 17 సంవత్సరాల క్రితం ప్రముఖ పాత్రికేయుడు చెన్నూరి వెంకట సుబ్బారావు సంపాదకుడుగా, ఇంచుమించు అన్నీ బాధ్యతలూ తనే భుజాన వేసుకుని “తెలుగు టైమ్స్” అనే వార పత్రిక అమెరికాలో ప్రారంభించాడు. మొదట్లో నేను కూడా ఆ పత్రికకి సాహిత్యం పేజీలు సమకుర్చేవాడిని. కాలక్రమేణా పరిమితమైన ముద్రణ స్థాయి కష్టాల నుంచి ఆ పత్రిక అంతర్జాల స్థాయికి ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా తెలుగు వారి సమాచారం పూసగుచ్చినట్టు ప్రకటించే ఏకైక వార్తా పత్రిక గా ఇప్పుడు 17వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం. అంతటితో ఆగక అతని ప్రధాన నిర్వహణలోనే 2013 లో “పాఠశాల” అనే పేరిట అమెరికాలో పలు నగరాలలో తెలుగు బడులు స్థాపించి విజయవంతంగా నిర్వహించడం తెలుగు టైమ్స్ సాధించిన మరొక విజయం. వీటన్నిటికీ మద్దతు దారు ఆత్మీయ మిత్రుడు కోమటి జయరామ్, తదితరులు. తెలుగు టైమ్స్ 17వ వార్షికోత్సవం సందర్భంగా అన్నింటికీ సూత్రధారి చెన్నూరి సుబ్బారావుకి, పత్రిక యాజమాన్యానికీ, సిబ్బందికీ నా హృదయపూర్వక అభినందనలు. నిజానికి అమెరికా తెలుగు సంఘాల మీద ఒక సాధికారిక పుస్తకమే ప్రచురించాడు చెన్నూరి వెంకట సుబ్బారావు.
వార్త అందగానే వెంటనే ప్రతి స్పందించే అరుదైన గుణం నాకు తెలుగు టైమ్స్ పత్రికలో భలే నచ్చే విషయం. ఎందుకంటే గత అనేక సంవత్సరాలగా నేను వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించే ఉగాది పోటీలు, ప్రపంచవ్యాప్తంగా సాహితీ సదస్సులూ, ధార్మిక కార్యక్రమాలూ మొదలైన ఈ ప్రకటన విడుదల చేసినా, యదాతధంగా కానీ, సంక్షిప్తంగా కానీ ప్రచురించి మాకు అంతర్జాతీయ ప్రచారం కలిగించే పత్రిక తెలుగు టైమ్స్. అంతే కాదు, ఆ ప్రచురణ వివరాలని నాకు వెనువెంటనే తెలియపరిచడం కూడా ఆ పత్రిక ప్రత్యేకత.
ఇక …తెలుగు టైమ్స్ 17వ వార్షికోత్సవ పత్రికలో అమెరికాలో 17 మంది తెలుగు సాహితీవేత్తలనీ, భాషా సేవకులనీ గుర్తించడం చాలా మంచి ఆలోచన. ఆ సంచికనీ, అందులో మాకు దక్కిన గుర్తింపునీ ఈ క్రింది లంకె లో చూడవచ్చును. చెప్పొద్దూ, ఎవరు వ్రాశారో కానీ, నా గురించి కూడా చాలా సమాచారమే సేకరించి బాగానే వ్రాశారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
https://www.telugutimes.net/
మీకు నా విన్నపం ఏమిటంటే…..
నా మాట దేవుడెరుగు….అమెరికాలో తెలుగు భాషా, సాహిత్య సేవలలో తరిస్తున్న 16 మంది మహనీయుల గురించి తెలుసుకునే అవకాశం తెలుగు టైమ్స్ కలిగించింది. అవి చదవండి. స్ఫూర్తి పొందండి….సాహిత్య సేవ చేసి తరించండి.
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు













