పాక్ విషయంలో మా వైఖరి మారలేదు
ఉగ్రవాద కార్యాకలపాలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ను అగ్రరాజ్యం అమెరికా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ఉగ్రవాదం అణచివేత దిశగా పాకిస్తాన్ నిజాయతీగా వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్, పాక్ పశ్చిమ సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని అణచివేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాకిస్తాన్ వెళ్లిన తాను ఇదే విషయాన్ని ఆయనకు వివరించానని మీడియా సమావేశంలో పొంపియో వెల్లడించారు.
దక్షిణ మధ్య ఆసియా విషయంలో అమెరికా విధానం మారదని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఆశ్రయమివ్వకూడదని తాము కోరుకుంటున్నామని, తాలిబన్, హక్కానీ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయమివ్వరాదని, ఆప్ఘనిస్తాన్లో శాంతిని స్థాపించాలని పొంపియో ఆక్షాంక్షించారు. పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని మరోసారి సృష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజాయతీగా, సంతృప్తికరమైన చర్యలు తీసుకునే వరకూ పాక్కు రక్షణ సహాయం అందించబోమని తేల్చిచెప్పారు.













